ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం తెలిపిన రాజకీయ ప్రముఖులు..మోడీ , జగన్ , కేసీఆర్ , పీఎం కేపీ శర్మ, పవన్ , చంద్రబాబు !

inner-page-banner

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూతతో దేశం విషాదంలో కూరుకుపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, మేథావిని దేశం కోల్పోయిందని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రణబ్‌ విశేషంగా కృషి చేశారని అన్నారు. అలాగే ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిరాడంబరత, నిజాయితీ, సత్ప్రవర్తనలకు ప్రతిరూపం ప్రణబ్ ముఖర్జీ అని పేర్కొన్నారు. ఆయన మన దేశానికి అంకితభావంతో, శ్రద్ధాసక్తులతో సేవ చేశారన్నారు. ఆయన ప్రజా జీవితంలో చేసిన సేవలు, కృషి అమూల్యమైనవని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.


Also Read: అస్తమించిన దాదా !

అలాగే ,ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయం అని కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా ప్రణబ్‌ దేశానికి ఎంతో సేవలు చేశారని ప్రశంసించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

అలాగే , ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు. యాదాద్రి ఆలయ పనులను పరిశీలించి అభినందించారని ప్రణబ్ తెలంగాణ పర్యటనను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కాగా, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన గతకొంత కాలంగా ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Also Read: అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు .. కొత్తగా ఓపెన్ అయ్యేవి ఇవే !

నేపాల్ గొప్ప స్నేహితుడ్ని కోల్పోయిందని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణంపట్ల ఆయన సంతాపం తెలిపారు. భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుచేసుకుంటామని చెప్పారు. ఆయన మరణవార్త తనను బాధకు గురిచేసిందని కేపీ శర్మ ఓలి అన్నారు. భారత ప్రభుత్వం, భారతీయులు, ప్రణబ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతునట్లు ట్వీట్ చేశారు.మరో పొరుగుదేశమైన భూటాన్ కూడా ప్రణబ్ మరణంపట్ల సంతాపం తెలిపింది. భూటాన్ ప్రజల తరుఫున తాను సంతాపం తెలియజేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని లొటే షెరింగ్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు శక్తిని కూడగట్టుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

ప్రణబ్ ముఖర్జీ గారు పోయారన్న వార్త విని ఎంతో బాధపడ్డానని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. దేశం ఒక అసాధారణమైన రాజనీతి కోవిదుడ్ని కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రణబ్ సర్వజ్ఞుడైన వ్యూహకర్త అని, క్రమశిక్షణ, హుందాతనం మూర్తీభవించిన వ్యక్తి అని కొనియాడారు. సిద్ధాంతాలకు కట్టుబడిన మనిషి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Also Read: కోరిక తీర్చాలంటూ మహిళ చేయి పట్టుకున్న గ్రామ వాలంటీర్ ..అరెస్ట్ !

మాజీ రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో విలక్షణమైన ధ్రువతార అని, రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలను మరిచిపోలేదని వివరించారు. తన పండిట్ల కుటుంబ పరంగా వస్తున్న దేవతార్చన సంప్రదాయాన్ని అనుసరించి పండుగ దినాల్లో ఆ సంప్రదాయాన్ని అనుసరించడం విశేషం అని తెలిపారు. ఈ విలక్షణతను తానెంతో అభిమానిస్తానని పవన్ వెల్లడించారు. ప్రణబ్ రాజకీయ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని ఉద్ఘాటించారు.

అయితే ప్రణబ్ ముఖర్జీ 2012, జులై 25 నుంచి 2017, జులై 25 వరకు రాష్ట్రపతిగా సేవలందించారు.  అలాగే ఆయన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రణబ్ ముఖర్జీకి మంగళవారం ఢిల్లీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సైనిక గౌరవ వందనంతో ఆయనకు తుది వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube